నగరాల్లో ఉండేవారికి తెలిసే ఉంటుంది.. తెలీని వారికోసం, చాలా యధార్థ సంఘటనల ఆధారంగా..

సరదాగా ఒక ఆదివారం అలా మాల్లో షాపింగ్ అని వెళ్ళారనుకోండి, పేకముక్కల్లాంటి కొన్ని కార్డుల కట్ట, కొన్ని పెన్నులు పట్టుకొని కొంతమంది తిరుగుతూ ఉంటారు.. సార్/ మేడమ్ లక్కీ డ్రా ఉందండి మీ పేరు ఫోన్ నంబర్ రాసివ్వండి చాలు అంటారు. ఆ ఇక్కడ పోయేదేముందిలే అని పేరు, ఫోన్ నంబర్ రాసి ఇచ్చేశారనుకోండి, కొన్ని రోజులకి, అంటే మరుసటి రోజు, లేదా వారం తర్వాత, ఒక నెల తర్వాతైనా.. ఒక ఫోన్ వస్తుంది.. మేం ఫలానా దగ్గర్నుంచి ఫోన్ చేస్తున్నాం.. మీరు అప్పుడు మాల్ లో వేసిన కార్డుకి లక్కీడ్రాలో గిఫ్ట్ వచ్చిందని. అది విని ఉబ్బితబ్బిబ్బైపోయి “అవునా ఏమొంచింది?” అని అడిగిఅడగగానే, ఒక 1 గ్రామ్ గోల్డ్ కాయిన్ అనో, ఒక మిక్సీ అనో ఏదోటి చెప్తారు. మీరు మా అడ్రెస్ కి వచ్చి గిఫ్ట్ కలెక్ట్ చేసుకోండి అని కూడా చెప్తారు… ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, మీరిచ్చిన ఫోన్ నంబర్, పేరు కాకుండా మిగతా వివరాలు కూడా అడుగుతారు.. అంటే పెళ్లైందా, పిల్లలున్నారా, ఎక్కడుంటారు అలా అని.. గిఫ్ట్ తీసుకెళ్తానికి వచ్చినప్పుడు తప్పకుండా కుటుంబ సమేతంగా రమ్మంటారు.. అది కండిషన్.. కుటుంబ సమేతంగా రాకపోతే గిఫ్ట్ ఇవ్వలేం అంటారు.. వాళ్ల ఆఫీస్ లోని లేదా ఏదైనా బాంక్వెట్ హాల్లోని ఇలాంటి సమావేశాలు పెడతారు.. సరేలే సెలవు రోజే కదా అందరం వెళ్లి తెచ్చుకుందాం అని కుటుంబ సమేతంగా వెళ్తే.. అందరినీ కూర్చోపెట్టి కాఫీలు, టీలు, జూసులు గట్రా ఇచ్చి మాంచి ఏసీ రూంలో ప్రెసెంటేషన్ మొదలెడతారు..

ఇక్కడ గిఫ్ట్ కోసం వస్తే ప్రెసెంటేషన్ ఏంటని అనుకోవచ్చు కానీ ఇప్పటిదాకా సరిపెట్టుకున్న ప్రాణం మళ్ళీ సరేలే ఇంత దూరం వచ్చాం ఏంటో చూసెళ్దాం అనుకుంటే.. అనర్గళంగా వాళ్ళ బిజినెస్ లో పెట్టుబడి పెట్టండనో, మల్టీలెవల్ మార్కెటింగ్లో జాయిన్ అవ్వమని, ఇంత డబ్బు పెడితే ఇన్సూరెన్సులో 10 ఏళ్ల తర్వాత అంతొస్తుందని, అలా ఏదొక వ్యాపార లావాదేవీలు చెప్తారు.. తర్వాత ఒక్కొక్క ఫ్యామిలీనీ ఒక్కొక్క టేబుల్ దగ్గర కూర్చోపెట్టుకుని ఎంత కడతారు.. ఏ ప్లాన్లో చేరుతారు అని మొదలు పెడతారు.. ఎంత మొండివారైనా, వాళ్లు చూపించే ఆదరాభిమానాలు(?) చూసి ముచ్చట పడతారు… కుటుంబ వివరాలనుబట్టి, కులమో, ప్రాంతమో లేదా మరేదైనా రూపంలో లంకెలు కూడా వేస్తారు.. అంటే వీళ్లు మన వాళ్లే, లేదా మనలాంటి వాళ్లే అనే భావన తీసుకు రావటానికి. సంభాషణల్లో మన ఇష్టాయిస్తాలని గుర్తించి వాటి దిశగా మనల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు.. ఇక్కడ పెద్ద విషయం ఏంటంటే, మన కుటుంబం ఎదుట మనతో మాట్లాడటం, అంతా మంచే మాట్లాడటం, సానుకూల ధోరణిలో ఉండటంతో మనం సహజంగా వ్యతిరేక దిశగా వెళ్లలేం.. మొహమాటంతోనో, మనవాళ్లముందు మన కుటుంబానికి మంచి చెబితే, చెడు నిర్ణయం తీసుకోవటం తప్పనో, ఏదో రూపంలో మభ్యపెట్టి మనచేత వాళ్లు కావాలనుకున్న దాంట్లో చేరుస్తారు.. ఇక్కడ ఎవ్వరూ ఎవ్వరినీ బెదిరించో చేసింది కాదు.. స్వతహాగా నవ్వుతూ పులిబొనులో చెయ్యి పెట్టినట్టు.. సంతకాలు అంతా అయ్యాక ఆ ఇచ్చే 1గ్రామ్ నాణమో, మిక్సీయో ఇచ్చి పంపుతారు.. ఇంటికి చేరి ఒంటరిగా ఆలోచిస్తాకాని మనం అంత నిస్సహాయంగా ఎలా అయిపోయాం అనిపించక మానదు.. రెండు మూడు వేలకోసం వెళ్లి కొన్నివేలో, లక్షలో తగలేసి వచ్చాం అని మబ్బులిడిపోతాయ్.. కుటుంబం ముందే చేయటంతో వాళ్లతో అంటే వాళ్లేమనుకుంటారనో బయటికి చెప్పుకోలేక లోపల లోపల మథనపడిపోతాం. మన కుటుంబం ఆ రోజుని ఎప్పుడో మర్చిపోతుంది, మనకి మాత్రం అదొక తీరని వేదనలా మిగిలిపోతుంది.

అ వ్యాపారం మంచిదై ఉండొచ్చుకదా, కొన్ని మంచివే ఉంటాయేమో, వాళ్లు మనుషులే, వాళ్లకి అదొక ఉద్యోగం అనుకునే వాళ్లకి.. ఒక లక్కీడ్రా అనే అబద్ధంతో మొదలైన ఏ వ్యాపారమైనా అనైతికం… పైగా కుటుంబం ఎదుట బలహీనతలతో నిస్సహాయుల్ని చేసి చేసే వ్యాపారం చేయటం వంచన, మోసం.

జీవితంలో ఏదీ ఉచితంగా రాదు.. అందులోనూ డబ్బు అసలు రాదు… కష్టమో, సమయమో, డబ్బో ఏదొక ఖర్చు లేకుండా ఏదీ రాదు.. ఈ సారి లక్కిడ్రా అంటే మళ్లీ ఆ కార్డు ముక్క నింపిస్తే, ఒకవేళ నింపినా, వాళ్లు పిలిచినా చోటుకి కుటుంబ సమేతంగా వెళ్తే, ఒకవేళ వెళ్ళినా జూస్లు గట్రా తాగేసి రాకుండా ఏదైనా స్కీంలో చేరితే మీకొక వీరతాడు🙏🏼!